భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, అక్టోబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

ఫోటో ఆల్బమ్ ఇచ్చేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదం

నర్సాపూర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఫోటో ఆల్బమ్ అందించేందుకు స్నేహితుడితో కలిసి బైక్‌పై బయలుదేరిన యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నర్సాపూర్ మండల పరిధిలో జరిగిన ఈ ప్రమాదం చిలిప్‌చెడ్ మండలం సమ్లా తండాలో విషాదాన్ని నింపింది. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న చిన్న కుమారుడు మృత్యువాత పడటంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

నర్సాపూర్ పోలీస్ స్టేషన్ వివరాల ప్రకారం.. అక్టోబర్ 25వ తేదీ రాత్రి సుమారు 11:10 గంటలకు పెద్దచింతకుంట గ్రామ శివారులోని జల హనుమాన్ చికెన్ షాప్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమ్లా తండాకు చెందిన మాలోత్ వినోద్ (23), తన స్నేహితుడు బానోత్ సర్దార్ (30)తో కలిసి ఫోటో ఆల్బమ్ అందించేందుకు బైక్‌పై నర్సాపూర్‌కు బయలుదేరారు.

వీరు పెద్దచింతకుంట గ్రామ శివారుకు చేరుకున్న సమయంలో మెదక్ నుంచి హైదరాబాద్ వైపు ఇనుప రాడ్ల లోడుతో వెళ్తున్న లారీ వెనుక భాగాన్ని వీరి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినోద్ తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. సర్దార్ కూడా గాయాలపాలయ్యాడు.

వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే వినోద్ మృతి చెందాడు. గాయపడిన సర్దార్‌కు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించారు.

నర్సాపూర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై ఫిర్యాదు

ప్రమాదంపై మృతుడి తండ్రి మాలోత్ వాసురాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీలోని ఇనుప రాడ్లు వెనుకవైపు నుంచి బయటకు పొడుచుకొని ఉన్నాయని, లారీ డ్రైవర్ ఎలాంటి సూచనలు ఇవ్వకుండా అకస్మాత్తుగా వేగం తగ్గించడంతోనే ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా లారీ డ్రైవర్ పిండి అంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న వాసురాంకు నలుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వినోద్ చిన్న కుమారుడు కావడంతో అతడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చేతికొచ్చిన కొడుకు అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటుగా మారింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి సంబంధించిన ఆరోపణలపై విచారణ కొనసాగిస్తున్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని నర్సాపూర్ పోలీసులు సూచించారు.