భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బాలలపై లైంగిక నేరాలకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని సీనియర్ న్యాయవాది సి.హెచ్. స్వరూపరాణి తెలిపారు. బాలికలు, బాలుర పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నర్సాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో, న్యాయమూర్తి ఎం. హేమలత ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాలలో ఉదయం ప్రార్థనా సమయంలో నిర్వహించిన ఈ సదస్సులో సీనియర్ న్యాయవాది, లీగల్ సర్వీసెస్ మాజీ కౌన్సిల్ న్యాయవాది సి.హెచ్. స్వరూపరాణి పాల్గొని విద్యార్థులకు పోక్సో చట్టంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు.
18 సంవత్సరాల లోపు బాలికలు, బాలురపై లైంగిక నేరాలకు పాల్పడితే నేర తీవ్రతను బట్టి పోక్సో చట్టం ప్రకారం కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. పిల్లలపై లైంగిక వేధింపులు లేదా ఇతర అఘాయిత్యాలు జరిగినట్లు తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఫిర్యాదు అందిన తర్వాత చట్ట ప్రకారం విచారణ చేపట్టి, నేరం నిరూపితమైతే న్యాయస్థానం ద్వారా శిక్షలు విధిస్తారని వివరించారు.
పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
విద్యార్థులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, చెడు మార్గాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని స్వరూపరాణి సూచించారు. పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. పిల్లల భద్రత, గౌరవం, హక్కులను కాపాడటం ఒక్కరి బాధ్యత మాత్రమే కాదని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సామ్య నాయక్, ఉపాధ్యాయులు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.