భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, అక్టోబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

సీఎంఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలి.. మిల్లర్లకు డెడ్‌లైన్

సీఎంఆర్ బకాయిలను సన్న బియ్యం రూపంలో అందజేయాలి – పెండింగ్ బియ్యాన్ని గడువులోగా డెలివరీ చేయాలి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సీఎంఆర్ బకాయిల చెల్లింపులు, పెండింగ్ బియ్యం డెలివరీల విషయంలో రైస్ మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా బకాయిలను పరిష్కరించడంతో పాటు, నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం బియ్యం సరఫరాను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

సోమవారం మెదక్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రైస్ మిల్లుల యాజమాన్యాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంఆర్ బకాయిలు, పెండింగ్ బియ్యం డెలివరీల పురోగతిని సమీక్షించి, మిల్లర్లు తీసుకోవాల్సిన చర్యలపై అదనపు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

కేఎంఎస్ 2014-15 నుంచి ఖరీఫ్ 2024-25 వరకు పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ బకాయిలను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పరిష్కరించాలని నగేష్ ఆదేశించారు. రబీ 2022-23 సీజన్‌కు సంబంధించి వేలం వేసిన ధాన్యాన్ని మినహాయించి, మిగిలిన బకాయిలకు సంబంధించిన రైస్ మిల్లర్లు సన్న బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు తప్పనిసరిగా అందజేయాలని తెలిపారు.

సీఎంఆర్ బకాయిలను సన్న బియ్యం రూపంలో అందజేయాలి – పెండింగ్ బియ్యాన్ని గడువులోగా డెలివరీ చేయాలి

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సన్న బియ్యం అందజేయడానికి బదులుగా ధాన్యం విలువకు సమానమైన మొత్తాన్ని చెల్లించే సందర్భంలో, నిర్దేశించిన 125 శాతం మొత్తంతో పాటు ఒప్పందం ప్రకారం 12 శాతం వడ్డీ, పెనాల్టీని కూడా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రబీ 2022-23 సీజన్‌కు సంబంధించి వేలం వేసిన ధాన్యానికి సంబంధించిన బకాయిలను సైతం తక్షణమే చెల్లించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న 45 రోజుల గడువులోగా సంబంధిత బకాయిలను పరిష్కరించుకోవాలని సూచించారు.

అదేవిధంగా, రబీ 2024-25 సీజన్‌కు సంబంధించిన పెండింగ్ సీఎంఆర్ బియ్యాన్ని, కేఎంఎస్ 2025-26 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన బియ్యాన్ని నిర్దేశించిన లక్ష్యాల మేరకు నిర్ణీత గడువులోగా ఎఫ్‌సీఐకి డెలివరీ చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. బకాయిల చెల్లింపులు, బియ్యం సరఫరాలో ఎలాంటి జాప్యం చేయకుండా మిల్లర్లు తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

గడువు దాటితే చట్టపరమైన చర్యలు

ప్రభుత్వ ఉత్తర్వులు, ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినా, సీఎంఆర్ బకాయిలు చెల్లించకపోయినా, నిర్ణీత గడువులోగా పెండింగ్ బియ్యం డెలివరీలను పూర్తి చేయకపోయినా సంబంధిత రైస్ మిల్లర్లపై నిబంధనల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగేష్ హెచ్చరించారు. ఇప్పటికే చేపట్టిన లేదా చేపట్టనున్న చట్టపరమైన చర్యలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సీఎంఆర్ బకాయిల పరిష్కారం, బియ్యం డెలివరీలను మిల్లర్లు ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.