భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: దేశ రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని భైంసా ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ స్వయంగా బైక్ నడుపుతూ పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ర్యాలీ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి క్లాత్ మార్కెట్, బస్టాండ్, శివాజీ చౌక్ మీదుగా సాగి తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలను గుర్తుచేస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ సాయికిరణ్ మాట్లాడుతూ.. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదని, వారి సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు, ప్రజలకు అమరవీరుల త్యాగాల గురించి తెలియజేసేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమంతో పాటు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు ఏఎస్పీ తెలిపారు. అదే విధంగా పోలీసు శాఖ విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే సేవలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహించే పోలీసుల సేవలను గుర్తించడం, అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భైంసా టౌన్ సీఐ సాయికుమార్, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.