భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బాలికను మాయమాటలతో నమ్మించి వెంట తీసుకెళ్లిన కేసులో నిందితుడికి మెదక్ జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించింది. పకడ్బందీగా దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు IPS అభినందించారు.
హాస్టల్‌కు వెళ్తుండగా ఘటన
2025 అక్టోబర్ 14న 8వ తరగతి చదువుతున్న బాలికను ఆమె తండ్రి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కించారు. అయితే, వడియారం వద్ద బస్సు ఆగకపోవడంతో బాలిక చేగుంటలో దిగింది. అక్కడి నుంచి తనకు పరిచయమున్న ఆనంద్ (22) అనే యువకుడికి ఫోన్ చేసి, తాను చేగుంటలో ఉన్నానని, తనను హాస్టల్ వద్ద దింపాలని కోరింది.
అక్కడికి చేరుకున్న ఆనంద్ బాలికకు మాయమాటలు చెప్పి, తనతో ఉంటే బాగా చూసుకుంటానని నమ్మించి వెంట తీసుకెళ్లాడు. మొదట మేడ్చల్‌కు తీసుకెళ్లి కొంతసేపు అక్కడ ఉన్న అనంతరం నిజామాబాద్‌కు వెళ్లారు. మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్‌కు చేరుకున్న తర్వాత ఆనంద్ బాలికను తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు.
బాలికను గుర్తించిన తూప్రాన్ పోలీసులు
అయితే, బాలికను ఇంటికి వెళ్లాలని ఆనంద్ తల్లి సూచించడంతో అక్టోబర్ 15, 2025 రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరూ బస్‌స్టాండ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో తూప్రాన్ పోలీసు సిబ్బంది బాలికను గుర్తించారు. అనంతరం ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు.
ఈ ఘటనపై తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో తొలుత మిస్సింగ్ కేసు నమోదైంది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు బాలికను గుర్తించి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తు అధికారి ఎస్‌ఐ ఎన్. జ్యోతి అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించారు.
సాక్ష్యాధారాలతో నిందితుడికి శిక్ష
కోర్టు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించారు. లీగల్ అడ్వైజర్ శ్వేత బాలిక సాక్ష్యం ఇచ్చేందుకు అవసరమైన సహకారం అందించారు. కేసు విచారణలో కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ కృష్ణగౌడ్, సీడీఓ నాగరాజు కూడా సహకరించారు.
పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మెదక్ జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభవల్లి నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. మహిళలు, బాలలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.