భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు IPS పోలీసు అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
మంగళవారం మెదక్ జిల్లా నిజాంపేట పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మొక్కను అందజేసి ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని ఎస్పీ పరిశీలించారు. కేసుల పరిష్కారంలో జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా దర్యాప్తును పూర్తి చేయాలని ఎస్పీ ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో కేసులకు సంబంధించిన వివరాలను CCTNS, ఈ-సాక్ష్య అప్లికేషన్లలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలిపారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు మహిళల భద్రత, వేధింపుల నివారణ, చట్టపరమైన రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.
గ్రామస్థాయిలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు VPOలు ప్రతి గ్రామాన్ని సందర్శించాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని, ఇందుకోసం కళాబృందాల సహకారం తీసుకోవాలని సూచించారు.
అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమైన ఎస్పీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని, ఎవరైనా అవినీతికి పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీలో సీఐలు సైదా, సందీప్ రెడ్డి, ఎస్ఐ రాజేష్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.