భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది: MP వేం నరేందర్ రెడ్డి

దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది: MP వేం నరేందర్ రెడ్డి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థులకు నాణ్యమైన విద్యను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుపై దృష్టి సారించిందని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు అరగంట ప్రయాణంలోనే ఉన్నత విద్యను అభ్యసించేలా అవసరమైన విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ₹7.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.

నెల్లికుదురు మండల కేంద్రంలోని విద్యాలయాల సముదాయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వేం నరేందర్ రెడ్డితో పాటు స్థానిక MLA డాక్టర్ భూక్య మురళి నాయక్, MP బలరాం నాయక్, డోర్నకల్ MLA రామచంద్ర నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, మానుకోట మున్సిపల్ చైర్మన్ జ్యోతి, గ్రంథాలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఇన్‌చార్జి DEO అనిల్ కుమార్ పాల్గొన్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం నెల్లికుదురుకు చేరుకున్న వేం నరేందర్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదవ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 122 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా మొదటగా నెల్లికుదురులో పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. జూన్ మొదటి వారం నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి పాఠశాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి ఒక పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వేం నరేందర్ రెడ్డి చెప్పారు. పబ్లిక్ స్కూల్స్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి వంటి పనులను కూడా ప్రభుత్వం చేపడుతోందన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కేసముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి తదితర ప్రాంతాల్లో విద్యాసంస్థలు, ఏటీసీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది: MP వేం నరేందర్ రెడ్డి

శ్రీ రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధికి ₹కోటి

నెల్లికుదురులోని చారిత్రక శ్రీ రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధికి ₹కోటి మంజూరు చేయడానికి కృషి చేస్తానని వేం నరేందర్ రెడ్డి ప్రకటించారు. అంతకుముందు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు చేశారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆయనకు స్థానిక నాయకులు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ నిర్మాణం, దాని విశిష్టత ఎంతో ప్రసిద్ధి చెందాయని పేర్కొంటూ అభివృద్ధికి అవసరమైన నిధుల విడుదలకు కృషి చేస్తానని తెలిపారు.

విశ్రాంతి భవనానికి అదనపు నిధుల కోసం ప్రయత్నం

నెల్లికుదురులో నిర్మాణంలో ఉన్న విశ్రాంతి భవనాన్ని వేం నరేందర్ రెడ్డి సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఆధునిక సదుపాయాలతో గెస్ట్ హౌస్ నిర్మాణం పూర్తయ్యేలా అదనపు నిధులు విడుదల చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

పీహెచ్‌సీని 30 పడకలకు పెంపు.. డయాలసిస్ కేంద్రంపైనా పరిశీలన

దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది: MP వేం నరేందర్ రెడ్డి

నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరించనున్నట్లు వేం నరేందర్ రెడ్డి వెల్లడించారు. స్థానికుల విజ్ఞప్తుల మేరకు నెల్లికుదురులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఈ చర్యలతో స్థానిక ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు.

కొత్త బస్టాండ్ కోసం స్థలం కేటాయించాలని సూచన

నెల్లికుదురులో ప్రస్తుతం ఉన్న బస్టాండ్ చిన్నదిగా ఉండటంతో ప్రయాణికులకు అనుకూలంగా కొత్త బస్టాండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఒక ఎకరం ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి కేటాయించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌కు సూచించారు. స్థలం ఖరారైన వెంటనే బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. నెల్లికుదురులో రోడ్ల అభివృద్ధితో పాటు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం

దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది: MP వేం నరేందర్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల వంటివని వేం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు వ్యవసాయ పరికరాలు, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తుచేశారు.

ప్రజా సంక్షేమ పథకాలతో పాటు విద్య, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాసంస్థలు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు ప్రయాణ భారం తగ్గడంతో పాటు ఉన్నత చదువులు అభ్యసించేందుకు అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

ఎల్ నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుత సాగు పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వేం నరేందర్ రెడ్డి సూచించారు. ఎల్ నినో ప్రభావం కారణంగా వ్యవసాయంపై ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గత రెండేళ్లుగా పంటలు బాగా పండాయని, ఈసారి నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక MLA డాక్టర్ భూక్య మురళి నాయక్, MP బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, కలెక్టర్ స్నేహ శబరీష్, సర్పంచ్ పులి వెంకన్న తదితరులు మాట్లాడారు. కేసముద్రం ఏఎస్సీ చైర్మన్ సంజీవరెడ్డి, తహసీల్దార్ చంద నరేష్, ఎంపీడీవో సింగారపు కుమార్, MEO రాందాస్, వివిధ శాఖల అధికారులు, DCC అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు యాదవ రెడ్డి, భరత్ చందర్ రెడ్డి, GJCS మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వీరస్వామి, ఉపేందర్ రావు, హైస్కూల్ హెచ్‌ఎంలు జలగం శ్రీనివాస్, వాణిశ్రీ, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.