భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రైతులు వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులను అనుసరించి పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన, అధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ సూచించారు. పంటల సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించడం ద్వారా రైతులు మెరుగైన ఫలితాలు పొందవచ్చని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు వరి పొలంబడి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ యాస్మిన్ వరి సాగులో పాటించాల్సిన ఆధునిక మెళకువలు, పంట నిర్వహణ పద్ధతులపై రైతులకు వివరించారు.
వరి పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలని, అవసరానికి అనుగుణంగా ఎరువులు వినియోగించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సమగ్ర క్రిమి నియంత్రణ పద్ధతులను అనుసరించాలని తెలిపారు. పంటకు తెగుళ్లు, పురుగుల సమస్యలు తలెత్తినప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.
అలాగే విత్తన శుద్ధి, నేల సారాన్ని కాపాడుకునే పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని రైతులకు సూచించారు. సాగు ప్రారంభం నుంచి పంట కోత వరకు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తే అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన దిగుబడిని పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
శిక్షణలో భాగంగా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇనుగుర్తికి చెందిన రైతు గంజి శ్రీనివాస్ పొలాన్ని సందర్శించి వరి పంట పరిస్థితిని పరిశీలించారు. పంట ఎదుగుదల, సాగు విధానాలను పరిశీలిస్తూ రైతులకు అవసరమైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వి. భాస్కర్‌తో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.