భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

PHCలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి

PHCలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: డయాలసిస్ చేయించుకునేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ప్రయాణాలు, ఆర్థిక భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టు, డయాలసిస్ బాధితుడు పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులతో కలిసి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా చంద్రమౌళి గౌడ్ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన డయాలసిస్ బాధితులు చికిత్స కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వరంగల్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి రావడంతో ప్రయాణాల వల్ల శారీరకంగా అలసిపోతున్నారని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లాల్సి రావడంతో ప్రయాణ ఖర్చులు పెరిగి బాధిత కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి దూర ప్రయాణాలు మరింత భారంగా మారుతున్నాయని పేర్కొన్నారు.

నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తే మండలంలోని బాధితులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని చంద్రమౌళి గౌడ్ తెలిపారు. సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కావడంతో పాటు చికిత్స పొందడం సులభతరమవుతుందని చెప్పారు. బాధితుల సమస్యను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వేం నరేందర్ రెడ్డిని కోరారు.

డయాలసిస్ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తాం: వేం

డయాలసిస్ బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నెల్లికుదురు PHCలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. కేంద్రం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అలాగే నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరించనున్నట్లు వెల్లడించారు.