భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులకు సాగు ఖర్చులను తగ్గించి, వ్యవసాయ పనులను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటు ద్వారా రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
మంగళవారం మెదక్ జిల్లా నార్సింగి రైతు వేదికలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణ ప్రాధాన్యతను వివరిస్తూ, రైతులకు తక్కువ ఖర్చుతో ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు దేవ్ కుమార్ చెప్పారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు), స్వయం సహాయక సంఘాలకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ పరికరాలతో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా రైతులకు అవసరమైన యంత్రాలను అద్దెకు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.
సాధారణంగా వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయాలంటే రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అద్దె ప్రాతిపదికన యంత్ర పరికరాలను వినియోగించుకునే అవకాశం కల్పించడం ద్వారా రైతులపై ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయ కూలీల కొరతను అధిగమించడంతో పాటు, సాగు పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు.
అర్హత కలిగిన రైతు సంఘాలు, సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవ్ కుమార్ సూచించారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చి, రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి పద్మ, ఎంపీడీఓ తిరుపతి, ఐకేపీ ఏపీఎం సృజన్ రెడ్డి, ఎంఏఓ భరత్ కుమార్, ఏఈఓలు జనార్ధన్, భువనేశ్వరి, ఎఫ్‌పీవో అధ్యక్షుడు నాగోజి, పీఏసీఎస్ సీఈఓ నర్సింలు, డైరెక్టర్లు, సంఘాల సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులు పాల్గొన్నారు.