భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో మంగళవారం చైతన్య ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ నేతృత్వంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని నీటి పొదుపు, కరువును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు సందేశం అందించారు.
విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి, ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సంబంధించిన నినాదాలు చేస్తూ స్థానిక బొడ్రాయి వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచి తమడపల్లి కుమార్ హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.
ధైర్యంగా ఎదుర్కొందాం: సర్పంచి, కరస్పాండెంట్
ఈ సందర్భంగా సర్పంచి కుమార్, పాఠశాల కరస్పాండెంట్ కట్టయ్య యాదవ్ మాట్లాడుతూ.. కరువు పరిస్థితులను తట్టుకునేందుకు ప్రజలు ముందుగానే అప్రమత్తమై అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎల్ నినో ప్రభావం వల్ల కరువు ఏర్పడితే దాని ప్రభావం వ్యవసాయ రంగానికే పరిమితం కాదని, అన్ని రంగాలపై పడే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి గ్రామస్తులంతా ఐకమత్యంతో ముందుకు రావాలని, ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తే కరువు పరిస్థితుల్లో ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోవచ్చని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు సతీష్, పాఠశాల ఉపాధ్యాయులు శిరీష, అప్సర, నవ్య, షాహిన్, శ్రీలత, స్రవంతి, పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.