భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఇనుగుర్తి మండలానికి కొత్త భవనాలు.. బ్లూప్రింట్ మ్యాప్‌ల పరిశీలన

ఇనుగుర్తి మండలానికి కొత్త భవనాలు.. బ్లూప్రింట్ మ్యాప్‌ల పరిశీలన

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నూతనంగా ఏర్పాటైన ఇనుగుర్తి మండలంలో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సూచించారు. ఇందులో భాగంగా అధునాతన సాంకేతిక, వృత్తి విద్యా శిక్షణా కేంద్రం (ఏటీసీ), తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణాలకు సంబంధించిన బ్లూప్రింట్, లేఅవుట్ మ్యాప్‌లను మంగళవారం పరిశీలించారు.

ఇనుగుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ పరిశీలనలో ఎమ్మెల్యే మురళి నాయక్, MP పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు కేటాయించిన స్థలాలు, భవనాల నమూనాలు, లేఅవుట్ వివరాలను అధికారులు, ప్రజాప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ప్రజలకు సేవలు త్వరగా అందుబాటులోకి తేవాలి

ఇనుగుర్తి మండలం కొత్తగా ఆవిర్భవించిన నేపథ్యంలో ప్రజలకు పరిపాలనా సేవలు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని వేం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ లక్ష్యంతో ఏటీసీ, ఎమ్మార్వో (తహసీల్దార్) కార్యాలయం, పోలీస్ స్టేషన్‌కు శాశ్వత భవనాలు నిర్మించి, పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌కు సూచించారు.

అనంతరం కలెక్టర్ ఇనుగుర్తి నుంచి నెల్లికుదురు వెళ్లే మార్గంలో ఆయా భవనాల నిర్మాణాల కోసం కేటాయించిన భూమిని, స్థల విస్తీర్ణాన్ని, పనుల వివరాలను పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి భూమికి సంబంధించిన సర్వే నంబర్లు, సరిహద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు అందుబాటులోకి వస్తే ప్రజలకు అవసరమైన సేవలు ఒకేచోట సులభంగా పొందే అవకాశం మెరుగుపడుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్, గాయత్రి గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, బీఆర్ఎస్ రాష్ట్ర నేత వద్దిరాజు కిషన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్, ఆర్డీఓ రాజేశ్వరి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.