భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

కాచికల్–మేచరాజపల్లి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి

కాచికల్–మేచరాజపల్లి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని కాచికల్ నుంచి రామానుజాపురం, ఎర్రబెల్లిగూడెం మీదుగా మేచరాజపల్లికి వెళ్లే రహదారి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని ఎర్రబెల్లిగూడెం సర్పంచి ఉషా అశోక్ కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డితో కలిసి మంగళవారం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

తొర్రూరు–మానుకోట ప్రధాన రహదారిలోని కాచికల్ స్టేజి నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని సర్పంచి ఉషా అశోక్ తెలిపారు. రహదారి అధ్వానంగా మారడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాడైపోయిన రోడ్డు కారణంగా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, సంబంధిత అధికారులు స్పందించి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వేం నరేందర్ రెడ్డిని కోరినట్లు సర్పంచి తెలిపారు. కాచికల్, రామానుజాపురం, ఎర్రబెల్లిగూడెం మీదుగా మేచరాజపల్లి వరకు రోడ్డు పనులు చేపడితే ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు సమస్యకు పరిష్కారం చూపి, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు.