భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రైతులకు వ్యవసాయ భూముల పరిరక్షణ, భూసారం కాపాడుకోవడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ‘ఖేతి బచావో అభియాన్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రచారంలో భాగంగా వ్యవసాయ భూములను సంరక్షించడం, భూసారాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించడంతో పాటు, దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి వ్యవసాయ అధికారులు కూడా హాజరుకానున్నట్లు యాస్మిన్ పేర్కొన్నారు.
ఇనుగుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు బుధవారం ఉదయం 10 గంటలకు రైతు వేదికకు చేరుకుని కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె సూచించారు. ‘ఖేతి బచావో అభియాన్’ లక్ష్యాలు, వ్యవసాయ భూముల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు.