భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికవడం గర్వకారణమని ఇనుగుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమ్మ యాకయ్య తెలిపారు. ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పార్నంది విష్ణువర్ధన్ 11వ జాతీయస్థాయి మినీ సబ్-జూనియర్ అండర్-13 సాఫ్ట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభినందించారు.
వరంగల్‌లోని లాల్ బహదూర్ కళాశాల (LB College) మైదానంలో ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి మినీ సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో విష్ణువర్ధన్ మహబూబాబాద్ జిల్లా జట్టు తరఫున పాల్గొన్నాడు. టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ ఎంపికను మహబూబాబాద్ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి సమ్మెట ప్రేమ్‌కుమార్ అధికారికంగా ప్రకటించారు.
విష్ణువర్ధన్ విజయాన్ని పురస్కరించుకుని పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం అమ్మ యాకయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు గేమ్స్‌లోనూ రాణించినప్పుడే సంపూర్ణ వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలోని పాఠశాల నుంచి విద్యార్థి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలతోపాటు జిల్లాకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.
విష్ణువర్ధన్‌కు నిరంతరం శిక్షణ అందిస్తూ అతని ప్రతిభను వెలికితీసిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) తాళ్ళ ప్రణయ్‌ను హెచ్ఎం ప్రత్యేకంగా అభినందించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విష్ణువర్ధన్‌ను కూడా ప్రశంసించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
మహారాష్ట్రలోని సంజీవని విశ్వవిద్యాలయం వేదికగా ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న 11వ జాతీయస్థాయి మినీ సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో విష్ణువర్ధన్ తెలంగాణ రాష్ట్రం తరఫున బరిలోకి దిగనున్నాడు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు పాల్గొని విష్ణువర్ధన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ చాటి పతకం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.