భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి: ఎం. హేమలత

పోక్సో చట్టంపై విద్యార్థులకు న్యాయ అవగాహన  బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు  వ

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు వ్యక్తిగత భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్‌పర్సన్ ఎం. హేమలత సూచించారు. చదువుపై పట్టుదలతో దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో భాగంగా నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టంపై నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, భద్రత, రక్షణ, సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

బాలల హక్కులను గౌరవించాలి

ప్రతి బాలుడు, బాలిక భయం లేని వాతావరణంలో జీవిస్తూ స్వేచ్ఛగా విద్యను అభ్యసించే హక్కు కలిగి ఉన్నారని న్యాయమూర్తి ఎం. హేమలత తెలిపారు. పిల్లల హక్కులను పరిరక్షించడం, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

బాల, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి నేరాలకు పోక్సో చట్టం ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. బాలలపై జరిగే హింస, వేధింపులు, లైంగిక దోపిడీ, ఇతర అనుచిత చర్యలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌పై అవగాహన

పోక్సో చట్టంపై విద్యార్థులకు న్యాయ అవగాహన  బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు  వ

విద్యార్థులకు గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌, వ్యక్తిగత భద్రత, లైంగిక వేధింపుల నివారణ, ఆన్‌లైన్ భద్రత, బాలల హక్కులపై వివరించారు. తమకు ఇబ్బందికరంగా అనిపించే ప్రవర్తనను గుర్తించాలని, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా లేదా అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా మౌనంగా ఉండకూడదని సూచించారు.

అలాంటి సందర్భాల్లో భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని న్యాయమూర్తి తెలిపారు. పిల్లలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పగలిగే వాతావరణాన్ని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు కల్పించాలని సూచించారు.

అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం

బాలల రక్షణకు సంబంధించిన చట్టాలు, వాటి ప్రాముఖ్యతను న్యాయమూర్తి వివరించారు. అవసరమైన సందర్భాల్లో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా అందుబాటులో ఉండే ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు చట్టపరమైన సహాయం పొందేందుకు ముందుకు రావాలని సూచించారు.

బాలల భద్రత కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదని, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఎం. హేమలత స్పష్టం చేశారు. పిల్లలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

చివరగా విద్యార్థులు దుశ్చర్యలకు దూరంగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలని, మంచి లక్ష్యాలను నిర్దేశించుకుని చదువుపై పట్టుదలతో కృషి చేయాలని న్యాయమూర్తి సూచించారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వంతో ఉన్నత శిఖరాలను అధిరోహించి భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.