భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని తూప్రాన్ DSP జే. నరేందర్ గౌడ్ సూచించారు. నేరాల నియంత్రణకు నిరంతర నిఘా, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజలతో సత్సంబంధాలు కీలకమని తెలిపారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా DSP జే. నరేందర్ గౌడ్ మెదక్ జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో పరిశుభ్రత, సిబ్బంది బ్యారెక్స్, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. పోలీసు సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేసి, వాటిని సక్రమంగా వినియోగించాలని సూచించారు. స్టేషన్ ఆవరణలో కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు
స్టేషన్ రికార్డులను పరిశీలించిన DSP, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని SHO బీమరి సృజనకు సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, స్టేషన్ రికార్డుల్లో పార్ట్-1 నుంచి పార్ట్-5 వరకు ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, దీర్ఘకాలంగా పరిష్కారం కాని కేసులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
గ్రామాలపై పూర్తి అవగాహన ఉండాలి
విలేజ్ పోలీస్ అధికారులు (VPOలు) తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని DSP సూచించారు. గ్రామ పెద్దలు, యువతతో మంచి సంబంధాలు ఏర్పరచుకుని, స్థానిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని చెప్పారు. స్టేషన్ పరిధిలోని కేడీలు, అనుమానితులు, రౌడీలపై నిరంతరం నిఘా ఉంచి, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అనుమానితులను పాపిలోన్ డివైస్ ద్వారా తనిఖీ చేయాలని సూచించారు.
హాట్‌స్పాట్లపై నిఘా.. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి
ఆస్తి సంబంధిత నేరాలు జరిగే ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని DSP తెలిపారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ప్రతిరోజూ వాహనాల తనిఖీలు నిర్వహించాలని, అనుమానాస్పద వాహనాలను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది తమకు కేటాయించిన ప్రతి పాయింట్‌ను తనిఖీ చేయడంతో పాటు, డయల్-100 కాల్స్‌కు వేగంగా స్పందించాలని స్పష్టం చేశారు.
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు
సైబర్ నేరాల నివారణకు పాఠశాలలు, కళాశాలలు, పని ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని DSP సూచించారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా అందుబాటులోకి తెచ్చిన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లపై సిబ్బంది పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని చెప్పారు. వాటిని నేరాల నియంత్రణ, దర్యాప్తు ప్రక్రియలో సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు.
సిబ్బంది సమస్యలకు అండగా ఉంటా
పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, తమకు కేటాయించిన బాధ్యతలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని DSP నరేందర్ గౌడ్ సూచించారు. ఈ సందర్భంగా సిబ్బంది పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. పిల్లలకు ఉన్నత విద్య అందిస్తున్న సిబ్బందిని అభినందించారు. విధి నిర్వహణ పరంగా లేదా వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే తనను నేరుగా సంప్రదించవచ్చని, వాటి పరిష్కారానికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.