భారత్ సమాచార్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రంతా ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, బుధవారం తెల్లవారుజాము నుంచే పరిస్థితిని పర్యవేక్షించారు. తుఫాన్ కారణంగా ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యుత్, రహదారులు సహా అత్యవసర సేవలను వేగంగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 84,396 మందిని 290 పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపించాలని కోరుతూ సీఎం చంద్రబాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సహాయక, పునరావాస చర్యలకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
రాత్రంతా సమీక్షలు.. అధికారులతో సమన్వయం
తుఫాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరిపారు. బుధవారం ఉదయం సుమారు 32,000 మంది అధికారులు, సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రభావిత జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రం ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. తుఫాన్ కదలికలు, రహదారుల పరిస్థితి, విద్యుత్ అంతరాయాలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులతో చర్చించారు.
విద్యుత్, జలవనరులు, రోడ్లు-భవనాలు, వ్యవసాయం, పురపాలక-పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు అధికారులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
పునరావాస కేంద్రాల్లో బాధితులకు తగినంత ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చి, ప్రజలకు సురక్షితమని నిర్ధారించిన తర్వాతే వారిని తిరిగి ఇళ్లకు పంపించాలని ఆదేశించారు.
27 NDRF, SDRF బృందాలు రంగంలోకి
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 14 జిల్లాల్లో 16 NDRF, 11 SDRF బృందాలను మోహరించారు. రాష్ట్ర అత్యవసర నిర్వహణ కేంద్రం (SEOC), జిల్లా కంట్రోల్ రూమ్‌లు సమన్వయంతో స్థానిక అవసరాలను పర్యవేక్షిస్తున్నాయి.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్న ప్రాథమిక అంచనాల ప్రకారం, సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట, 10,450 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగాయి. దాదాపు 180 ఇళ్లు దెబ్బతిన్నాయి.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాలు తుఫాన్ ప్రభావానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. ఈ గణాంకాలు ప్రాథమిక అంచనాలు మాత్రమేనని, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యాక నష్టంపై మరింత స్పష్టత వస్తుందని ప్రభుత్వం తెలిపింది.
పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే బయటకు మళ్లించాలని, చెరువులు, కాలువల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
రైతులకు తక్షణ సాయం అందించాలి
తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు.
నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు అత్యవసర ఆర్థిక సహాయం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి నివేదికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పొలాల్లో నిలిచిన నీటిని యుద్ధప్రాతిపదికన తొలగించి పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్ల క్లియరెన్స్‌కు రెండు గంటల గడువు
తుఫాన్ కారణంగా రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రోడ్లపై కూలిన చెట్లను రెండు గంటల్లో తొలగించాలని విపత్తు నిర్వహణ, పోలీస్, మున్సిపల్ శాఖలకు గడువు విధించారు. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు స్తంభించకుండా చూడాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 220కి పైగా చెట్లు రోడ్లపై పడగా, బుధవారం మధ్యాహ్నానికి 170కి పైగా చెట్లను తొలగించినట్లు సమాచారం. యానాం పరిసర ప్రాంతాలు, ఏలూరు, విశాఖపట్నంలో రహదారుల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగాయి.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రాధాన్యం
తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లాలోనే సుమారు 6,000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు జిల్లా కలెక్టర్ నివేదించారు. గాలుల తీవ్రత తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ సిబ్బంది దెబ్బతిన్న స్తంభాలు, తెగిపడిన తీగలను సరిచేస్తూ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.
ప్రజలకు విద్యుత్ సేవలు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంబంధిత శాఖలకు సూచించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి మరమ్మతు పనులను వేగవంతం చేస్తున్నారు.
‘మన మిత్ర’ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం
తుఫాన్ ప్రభావిత ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘మన మిత్ర’ యాప్‌తో పాటు వాట్సాప్, సోషల్ మీడియా, జిల్లా కంట్రోల్ రూమ్‌లను వినియోగిస్తోంది. ఆర్టీజీ కార్యదర్శి కాటంనేని భాస్కర్, సీఈఓ ప్రఖర్ జైన్ పర్యవేక్షణలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. సమస్య పరిష్కారమైన తర్వాత బాధితులకు సమాచారం అందిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.