భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజల ప్రాణరక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మెదక్ జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి రాందాస్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ IPS జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు వెలకట్టలేనివని తెలిపారు. విధి నిర్వహణలో వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలు భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలను ప్రజలకు గుర్తుచేయడంతోపాటు, పోలీసులు నిర్వర్తించే విధులు, విధి నిర్వహణలో ఎదుర్కొనే సవాళ్లపై ప్రజల్లో అవగాహన పెంచడమే సంస్మరణ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని వివరించారు.
ప్రజల భద్రతతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విక్రాంత్ కుమార్ సింగ్ సూచించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. బైక్‌పై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించడంతోపాటు దాని స్ట్రాప్‌ను సరిగ్గా బిగించుకోవాలని సూచించారు. కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు.
వాహనాలు నడిపేటప్పుడు తమ ప్రాణాలకే కాకుండా, ఇంటి వద్ద తమ రాక కోసం ఎదురుచూసే కుటుంబ సభ్యుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని అదనపు ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేయకుండా, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ప్రయాణించి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు.
అనంతరం పోలీస్ అమరవీరుల గౌరవార్థం అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో DSPలు ప్రసన్న కుమార్, రంగనాథ్, CIలు మహేష్, జార్జ్, కృష్ణమూర్తి, RI శైలేందర్, SIలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.