భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

నవంబర్ 7న జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం

నవంబర్ 7న జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్ 7, 2026న కోర్టును ప్రారంభించనున్నట్లు జిల్లా జడ్జి నీలిమ వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ కావడంతో కోర్టు ఏర్పాట్లను వేగవంతం చేశారు.

తూప్రాన్‌లోని పాత MPDO కార్యాలయ భవనంలో జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఏర్పాటు చేశారు. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు భవనంలో అవసరమైన మరమ్మతులు, ఇతర మెరుగుదల పనులు చేపట్టి కోర్టు నిర్వహణకు అనుగుణంగా సిద్ధం చేశారు.

కోర్టు ప్రారంభోత్సవ తేదీని 07.11.2026గా ఖరారు చేసినట్లు జిల్లా జడ్జి నీలిమ తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఆమె తూప్రాన్‌లోని కోర్టు భవనాన్ని పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ముందుగా పూర్తిచేయాల్సిన పనులను సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ సోమవారం లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కోర్టు ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. ఈ పరిశీలనలో తూప్రాన్ DSP నరేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, SI గంగరాజు, రెవెన్యూ సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.