భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

విద్యార్థులకు యూనిఫామ్స్, టై, బెల్టులు, షూస్ పంపిణీ

విద్యార్థులకు యూనిఫామ్స్, టై, బెల్టులు, షూస్ పంపిణీ

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: విద్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని హాసకొత్తూర్ సర్పంచ్ రేవతి గంగాధర్ సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకుంటూ చదువులో మంచి ఫలితాలు సాధించి, ఉన్నత పౌరులుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.

కమ్మరపల్లి మండలంలోని హాసకొత్తూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రభుత్వం అందించిన ఉచిత యూనిఫామ్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేవతి గంగాధర్ పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్‌తో పాటు టైలు, బెల్టులు, షూస్ అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి సంవత్సరం విద్యార్థులకు యూనిఫామ్స్, నోట్ పుస్తకాలు, పుస్తకాలు అందిస్తోందని తెలిపారు. ఈసారి నాణ్యమైన షూస్‌ను కూడా అందించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో విద్యారంగం మరింత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నందున, వాటిని సద్వినియోగం చేసుకుంటూ చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మనోహర్, వార్డు సభ్యుడు కనుక నరసయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లింబాద్రి, ఉపాధ్యక్షుడు గంగాధర్, సత్యనారాయణ, గ్రామపంచాయతీ కార్యదర్శి నరసయ్య, ఉపాధ్యాయులు ప్రసాద్, అంజడ్‌తో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.