భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో చోరీ ప్లాన్.. నిందితురాలికి షాకింగ్ ట్విస్ట్

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో చోరీ ప్లాన్.. నిందితురాలికి షాకింగ్ ట్విస్ట్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బస్సుల్లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నిజాంపేట పోలీసులు రట్టు చేశారు. రాఖీ పండుగ సందర్భంగా బస్సులో చోరీకి గురైన 30 తులాల బంగారు ఆభరణాల కేసును పోలీసులు ఛేదించి, ప్రధాన నిందితురాలిగా గుర్తించిన మేకల సంధ్య (30)ను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి సుమారు 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు బృందానికి మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, IPS రివార్డులు ప్రకటించారు.

బస్సు ప్రయాణంలో బంగారం మాయం

నల్గొండకు చెందిన సూరం స్నేహ ఆగస్టు 26న రాఖీ పండుగ సందర్భంగా తన వద్ద ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలను బ్యాగ్‌లో పెట్టుకుని నిజాంపేటలోని తన తల్లిగారి ఇంటికి బయలుదేరారు. నిజాంపేటకు చేరుకున్న తర్వాత బ్యాగ్‌లో ఉన్న నగలు కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చోరీ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో నిందితురాలిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు.

ప్రత్యేక బృందాలతో దర్యాప్తు

అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ మార్గదర్శకంలో, తూప్రాన్ DSP జె. నరేందర్ గౌడ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. రామాయంపేట CI బి. సైదా, నిజాంపేట SI బి. రాజేష్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో సరూర్‌నగర్‌కు చెందిన మేకల సంధ్య (30)ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో చోరీకి ప్లాన్

విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితురాలు తన తల్లి సతుపాటి రాధిక, బంధువు అక్షింతల సంధ్య, బండి మోజెస్, బండి దుర్గలతో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో చోరీ ప్లాన్.. నిందితురాలికి షాకింగ్ ట్విస్ట్

చోరీ అనంతరం ముఠా సభ్యులు స్విఫ్ట్ కారులో హైదరాబాద్‌కు వెళ్లి, అక్కడి నుంచి ఇన్నోవా క్రిస్టాలో పరారైనట్లు వెల్లడించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఒకరితో ఒకరు ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా సంభాషించుకునేవారని విచారణలో గుర్తించినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, నిజామాబాద్, మెదక్ ప్రాంతాల్లోని బస్టాండ్లలోనూ ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ తెలిపారు.

25 తులాల ఆభరణాలు స్వాధీనం

నిందితురాలి నుంచి వివిధ రకాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 4 బంగారు చైన్లు, 4 లాకెట్లు, 1 పుస్తెల త్రాడు, 13 ఉంగరాలు, 1 ప్లాటినం ఉంగరం, నల్లపూసల దండలు, కంకణాలు, గాజులు, కమ్మలు, చంపస్వరాలు, ముక్కెర, సిక పువ్వు తదితర ఆభరణాలు ఉన్నాయి. వీటి మొత్తం బరువు సుమారు 25 తులాలు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.

ఈ కేసులో పరారీలో ఉన్న ఇతర నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, మిగిలిన సొత్తును స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి

బస్సులు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో ప్రజలు తమ విలువైన ఆభరణాలు, నగదు విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, చోరీ జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

పోలీసు బృందానికి ఎస్పీ రివార్డులు

ఈ కేసును వేగంగా ఛేదించి నిందితురాలిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు. రామాయంపేట CI సైదా, SIలు రాజేష్, బాలరాజ్, హెడ్ కానిస్టేబుల్ సునీత, కానిస్టేబుళ్లు రాకేశ్, భాస్కర్, నాగభూషణ్, సాజిద్, లక్ష్మణ్, రాజు, కృష్ణ, శ్రీనివాస్ నాయక్‌తో పాటు IT కోర్ సిబ్బంది విజయ్, వెంకట్, మహేందర్, ఇతర పోలీసు సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.