భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం వలిగొండ మండలం వెలువర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి పలు అంశాలపై ఆరా తీశారు.
ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, రోగుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ల్యాబ్ పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తున్నారా, గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎలా పర్యవేక్షిస్తున్నారు, శిశువులకు టీకాలు అందించే కార్యక్రమం ఎలా కొనసాగుతోంది అనే అంశాలను తెలుసుకున్నారు.
అదేవిధంగా 14 ఏళ్ల బాలికలకు HPV టీకాలు అందించే కార్యక్రమం అమలు తీరుపై కూడా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం డెంగ్యూ, ఇతర సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాలతో వచ్చే వారికి సకాలంలో పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.