భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: జిల్లాలోని ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, రోగ నిర్ధారణ కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. వైద్య సేవల్లో నాణ్యతను పెంచడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
గురువారం కలెక్టరేట్‌లో మెడికల్, డ్రగ్స్ విభాగాల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వైద్య సేవల నిర్వహణ, ఔషధ దుకాణాలు, రోగ నిర్ధారణ కేంద్రాల పనితీరుపై సమీక్షించారు. అధికారులు తరచూ తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులు, మెడికల్ షాపులు, ఇతర కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు
రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో ప్రజల నుంచి అధిక మొత్తాలు వసూలు చేసే కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. రోగులకు అందించే సేవలు, వసూలు చేస్తున్న ఛార్జీల విషయంలో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా వైద్య సేవల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.
చిన్నారుల టీకాలపై ప్రత్యేక దృష్టి
చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు అందేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ప్రజలకు జన ఔషధి మందుల వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. అందుబాటు ధరల్లో మందులు పొందే అవకాశాల గురించి ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.
టీబీ నిర్మూలనకు సమన్వయంతో కృషి
జిల్లాలో టీబీ వ్యాధి నిర్మూలనకు సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని భవేష్ మిశ్రా సూచించారు. వ్యాధిని సకాలంలో గుర్తించేందుకు అవసరమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, రోగులకు మెరుగైన వైద్య సలహాలు అందించడం, నిరంతరం పర్యవేక్షించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు కృషి చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో DMHO రాజేందర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్‌సుందర్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శారద, DCHS కాశీనాథ్, వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.