భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

ఎల్‌నినో ప్రభావం.. నీటి పొదుపుపై రైతులకు అవగాహన

భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, నీటి సంరక్షణ చర్యలు చేపడుతూ తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి అంజనీ దేవి సూచించారు. వలిగొండ మండలం అరూర్‌ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో పాల్గొన్న ఆమె, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు సాగు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తెలిపారు.

వాతావరణ శాఖ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికను రూపొందించినట్లు అంజనీ దేవి వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు పెరిగితే భూగర్భ జలాల మట్టాలు తగ్గే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

ఎల్‌నినో ప్రభావం.. నీటి పొదుపుపై రైతులకు అవగాహన

ప్రత్యామ్నాయ సాగులో భాగంగా తక్కువ నీటితో సాగు చేసుకునే పంటలపై దృష్టి పెట్టాలని ఆమె తెలిపారు. ముఖ్యంగా మునగ, ఆయిల్‌పామ్‌ పంటల సాగు చేపడితే ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం ముఖ్యమని సూచించారు.

ఈ ప్రత్యేక గ్రామసభలో గ్రామ సర్పంచి సుక్క ముత్యాలు, ఏఈఓ రమేశ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి లాలయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.