భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ మెదక్ పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా అదనపు SP విక్రాంత్ కుమార్ సింగ్, IPS జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. దేశ రక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.
మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన క్యాండిల్ ర్యాలీ పోస్ట్ ఆఫీస్, అంబేద్కర్ చౌరస్తా, రామాలయం మీదుగా రాందాస్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు SP విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయమని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి సేవలు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని, సమాజ భద్రత కోసం అమరులైన వారి త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదని పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు మహిళలు, పిల్లల భద్రతలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని అదనపు SP తెలిపారు. పోలీసుల విధి నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగేందుకు ప్రజల సహకారం అవసరమని చెప్పారు. పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
అమరవీరులు చూపిన మార్గంలో నడుస్తూ, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు అంకితభావంతో సేవలందించడమే వారికి అందించే నిజమైన నివాళి అని అదనపు SP స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో DSPలు ప్రసన్న కుమార్, రంగనాథ్, CIలు మహేష్, జార్జ్, కృష్ణమూర్తి, RIలు శైలేందర్, రామకృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.