భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

పట్టభద్రుల ఓటు నమోదును బాధ్యతగా తీసుకోవాలి: సత్యవతి రాథోడ్

పట్టభద్రుల ఓటు నమోదును బాధ్యతగా తీసుకోవాలి: సత్యవతి రాథోడ్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాబోయే గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ BRS శ్రేణులకు, పార్టీ బాధ్యులకు సూచించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా కార్యకర్తలు చొరవ తీసుకుని, వారికి అవసరమైన అవగాహన కల్పించాలని చెప్పారు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌తో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్న సత్యవతి రాథోడ్ పట్టభద్రుల ఓటరు నమోదు, రాబోయే MLC ఎన్నికలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు.

గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని ఆమె తెలిపారు. అందువల్ల ఓటరు నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా, అర్హులైన ప్రతి పట్టభద్రుడికి సమాచారం చేరవేయాలని సూచించారు. అవసరమైతే కార్యకర్తలు నేరుగా పట్టభద్రులను కలిసి ఓటు నమోదు చేసుకునే విధానం గురించి వివరించాలని చెప్పారు.

నవంబర్ 6తో గడువు ముగింపు

పట్టభద్రుల ఓటరు నమోదు గడువు నవంబర్ 6తో ముగియనున్న నేపథ్యంలో మిగిలిన సమయంలో ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సత్యవతి రాథోడ్ సూచించారు. గడువులోగా అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

అలాగే రాబోయే గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సర్పంచ్ బండి శ్రీనివాస్, పులి రామచంద్రు, భానోత్ భీముడు, బత్తిని అనిల్ గౌడ్, గొట్టిముక్కుల ఆదిరెడ్డి, వరిపెల్లి వెంకటేష్, తూళ్ల వివేక్, వంగాల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.