భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామ అభివృద్ధికి అందరూ తమవంతు సహకారం అందించాలని నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని సీనియర్ IAS అధికారి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు బియ్యాల వెంకట పాపారావుకు విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో గురువారం మడికొండ రాంపూర్‌లోని బియ్యాల వెంకట పాపారావు నివాసానికి సర్పంచ్ చైతన్య నాగరాజు వెళ్లారు. బైసా రాజేష్, నాగవెల్లి బాలరాజుతో కలిసి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బియ్యాల దయాకర్ రావు, బియ్యాల దేవేందర్ రావు, కోమండ్ల సోమేశ్వరరావుతోనూ సమావేశమయ్యారు.
గ్రామ సమస్యలను వివరించిన సర్పంచ్
ఈ భేటీలో మునిగలవీడు గ్రామంలో ఉన్న సమస్యలను సర్పంచ్ వివరించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన అంశాలపై దృష్టి సారించి, తమవంతు సహకారం అందించాలని కోరినట్లు చైతన్య నాగరాజు తెలిపారు. గ్రామ ప్రగతికి అనుభవజ్ఞుల సూచనలు, సహకారం ఎంతో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వారిని కలిసినట్లు పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకు సాగాలన్న ఆలోచనతో సర్పంచ్ చేపట్టిన ఈ ప్రయత్నం ప్రాధాన్యం సంతరించుకుంది.