భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్ నీనో ప్రభావంతో భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కౌడిపల్లి మండలం ధర్మసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో అందుబాటులో ఉన్న నీటి వనరులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి, VBG RAM G ఉపాధి హామీ పనుల అమలుపై MPDOతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆయా పనుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ నీనో ప్రభావం కారణంగా తాగునీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి వృథాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని వినియోగించేలా చూడాలని చెప్పారు.
గ్రామంలో మొదటి, రెండో విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. మంజూరైన ఇళ్లకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణ పనులు ప్రారంభించిన లబ్ధిదారులకు అధికారులు అవసరమైన ప్రోత్సాహం అందించాలని సూచించారు. ప్రభుత్వ అధికారుల సూచనలు పాటిస్తూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
అలాగే VBG RAM G ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల పనులు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను పెంచి, అర్హులైన గ్రామీణ కూలీలకు పని కల్పించేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో MPDO, స్థానిక సర్పంచ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.