భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్.

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యం కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఇతర సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.

శుక్రవారం కలెక్టర్ ప్రతిమా సింగ్, DCH శివదయాల్‌తో కలిసి నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటు, విధులకు హాజరవుతున్న తీరు, ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు రికార్డులను సైతం పరిశీలించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. వైద్యులు, సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరై తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా అన్ని విభాగాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వంశీ, వైద్యులు మీర్జా, గైనకాలజిస్ట్ ప్రేమ వర్ధిని, డాక్టర్ దుర్గా, అనస్థీటిస్ట్, సివిల్ సర్జన్ రాము, వసుధ, వీణ, ప్రియదర్శిని, నర్సింగ్ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.