భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని వలిగొండ గ్రామ సర్పంచ్ వెంకట పాపిరెడ్డి సూచించారు. పరిశుభ్రత అనేది ఒక్కరోజుకే పరిమితం కాకుండా ప్రతిరోజూ పాటించే అలవాటుగా మారాలని పిలుపునిచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రాజెక్టు పరిధిలోని వలిగొండ మండల కేంద్రంలో స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వెంకట పాపిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐసీడీఎస్ CDPO వెంకటరమణ, సూపర్‌వైజర్ పారిజాత సైతం పాల్గొని స్వచ్ఛత కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం, ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలు, తల్లులు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇళ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
పరిశుభ్రత వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యమవుతుందని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా గ్రామంలో మంచి వాతావరణాన్ని కల్పించవచ్చని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు. స్వచ్ఛత అనేది కేవలం ఒకరోజు నిర్వహించే కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో భాగం కావాలని పేర్కొన్నారు. గ్రామ పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రజలంతా తమ వంతు సహకారం అందించాలని కోరారు.
అలాగే గ్రామాభివృద్ధి కేవలం అధికారులకే పరిమితం కాకుండా ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి రసూల్, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు, మహిళలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.