భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని భువనగిరి MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న నమోదు ప్రక్రియను, ఇప్పటివరకు నమోదైన వివరాలను నాయకులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే పట్టభద్రుల ఓటరు నమోదుకు సంబంధించిన ఆన్లైన్ విధానం, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురించి వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన పట్టభద్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.
పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదుపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యంగా ఓటు హక్కుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నమోదు ప్రక్రియపై సమాచారం అందించాలని, ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా నాయకులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వలిగొండ పట్టణ, మండల ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.