భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామ పరిధిలోని భూముల హద్దులను పక్కాగా నిర్ధారించి, భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా భూభారతి పథకం కింద రీ సర్వే నిర్వహించనున్నట్లు మెదక్ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. ఈ ప్రక్రియపై రైతులు, గ్రామ ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు.
చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో భూభారతి పథకం కింద చేపట్టనున్న భూముల రీ సర్వేపై శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సబిత రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో, తహసీల్దార్ మాలతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మెదక్ ఆర్డీఓ రమాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్, గ్రామ పాలకవర్గ సభ్యులు ఆర్డీఓ రమాదేవిని శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆర్డీఓ రమాదేవి, AD కిషన్, DI అజీమ్ గ్రామస్తులకు భూభారతి రీ సర్వే విధానం, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. భూముల హద్దుల విషయంలో స్పష్టత తీసుకురావడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి భూ తగాదాలు తలెత్తకుండా ఈ సర్వే దోహదపడుతుందని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా అధికారులకు అవసరమైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.
అంబాజీపేట గ్రామ పరిధిలో మొత్తం సుమారు 634 ఎకరాల భూమిలో రీ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియలో ముందుగా గ్రామ సరిహద్దులు, గ్రామకంఠం భూములు, అటవీ భూములు, అసైన్డ్ భూములు, చెరువులు, కుంటలకు సంబంధించిన భూములను సర్వే చేస్తామని వివరించారు. ఈ పనులు పూర్తయిన తర్వాత పట్టా భూముల సర్వే చేపడతామని తెలిపారు.
రీ సర్వే ద్వారా ప్రతి భూమికి సంబంధించిన హద్దులపై స్పష్టత తీసుకువచ్చి, భవిష్యత్తులో యాజమాన్య హక్కులు, సరిహద్దుల విషయంలో వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజల భాగస్వామ్యంతో పూర్తి పారదర్శకంగా సర్వే ప్రక్రియను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
గ్రామంలో మరో వారం రోజుల్లో రీ సర్వే పనులను ప్రారంభించనున్నట్లు AD కిషన్, DI అజీమ్ తెలిపారు. సర్వే సిబ్బందికి రైతులు, గ్రామస్తులు సహకరించాలని, తమ భూములకు సంబంధించిన వివరాలను అందించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే సర్వే పనులను సజావుగా, వేగంగా పూర్తి చేయగలమని పేర్కొన్నారు.
ఈ గ్రామసభలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రాజు, వినయ్, మండల సర్వేయర్ దుర్గాభవాని, మాజీ సర్పంచులు సాన సత్యనారాయణ, బాల్య కిషన్, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు వివరించిన రీ సర్వే విధానం, భూభారతి పథకం ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు.