భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున గ్రామస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నశంకరంపేట మండల స్పెషల్ ఆఫీసర్ సింధు సూచించారు. గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా ఇప్పటి నుంచే పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని, అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ప్రజలకు నిరంతరం తాగునీరు అందించాలని సర్పంచులకు సూచించారు.
శుక్రవారం చిన్నశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ సింధు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు హాజరై తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ సింధు మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. నీటి కొరత ఏర్పడే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు నీటి కోసం ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపైనా సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా ప్రారంభించేలా సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఏఈ లోకేష్ సూచించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు.
గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో సూచించారు. గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో సర్పంచులు, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో MPDO దామోదర్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు చంద్రశేఖర్, కృష్ణగౌడ్, నాయిని ప్రవీణ్ కుమార్, శంకర్, నాగరాజు, నాగభూషణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.