భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బైక్‌లకు నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చుకుని భారీ శబ్దాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి హెచ్చరించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇతరులకు ప్రమాదం కలిగించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నర్సాపూర్ పట్టణంలో మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగంపై పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన సిద్ధేశ్వర్ స్వామి అనే వ్యక్తి తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్ అమర్చుకుని అధిక శబ్దంతో వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి, బైక్‌కు అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్‌ను తొలగించి, తిరిగి అసలు సైలెన్సర్‌ను ఏర్పాటు చేయించారు.
ఈ సందర్భంగా ఎస్సై రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది యువత బైక్‌లకు అనధికారికంగా సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలు చేస్తూ రోడ్లపై తిరుగుతున్నారని తెలిపారు. మరికొందరు అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఇతర వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారని పేర్కొన్నారు.
ఇకపై మోడిఫైడ్ సైలెన్సర్లతో వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేవలం కౌన్సెలింగ్‌తో సరిపెట్టబోమని ఎస్సై స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యువత సరదా కోసం చేసే ఇలాంటి పనులు ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను గౌరవించాలని సూచించారు. వాహనదారులు బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని ఎస్సై రంజిత్ రెడ్డి కోరారు.