భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బ్యాడ్మింటన్ పోటీల్లో మెదక్‌కు చెందిన పవన్, వర్ధన్ జోడీ ప్రతిభ చాటుకుని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామాయంపేటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఈ జోడీ విజేతగా నిలిచింది. పోటీల్లో పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
రామాయంపేట పట్టణంలోని బ్యాడ్మింటన్ కోర్టులో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో వివిధ జోడీలు పోటీపడ్డాయి. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లలో పవన్, వర్ధన్ జోడీ అద్భుత ప్రదర్శనతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. గంగారం, రవి జోడీ ద్వితీయ స్థానంలో నిలవగా, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, నాగేంద్ర జోడీ తృతీయ స్థానాన్ని సాధించింది.
శుక్రవారం నిర్వహించిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు.
అదేవిధంగా టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్ కానిస్టేబుల్ బి. యాదగిరితో పాటు రామాయంపేట బ్యాడ్మింటన్ అసోసియేషన్ (RBA) సభ్యులను ఎస్పీ ప్రత్యేకంగా సత్కరించారు. RBA సభ్యులు వెంకట్‌రెడ్డి, మల్లేష్ యాదవ్, రమేష్, శ్రీనివాస్, గోపాల్, నరేష్ అహ్మద్, సుధాకర్, మెట్టు యాదగిరిలకు మెమెంటోలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ చూపిన వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రామాయంపేట సీఐ సైదా నాయక్, ఎస్సైలు బాలరాజు, రాజేష్, సృజన, శివానందం, చైతన్యరెడ్డి, నరేష్, పోలీసు సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.