భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

BELలో 350 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టులు..

BELలో 350 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టులు..

భార‌త్ స‌మాచార్, ఉద్యోగం : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు ఉద్యోగావకాశం కల్పిస్తోంది. సంస్థలోని E-II గ్రేడ్‌లో ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 350 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 200, మెకానికల్ విభాగంలో 150 పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలు సంస్థలోని ప్రొడక్షన్, సపోర్ట్ సర్వీసెస్ విభాగాల కోసం చేపడుతున్నారు.

సంబంధిత విభాగాల్లో B.E., B.Tech లేదా నాలుగేళ్ల B.Sc ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం AMIE, AMIETE, GIETE అర్హతలు కలిగినవారికీ అవకాశం ఉంది. జనరల్, EWS అభ్యర్థులకు 2026 అక్టోబర్ 1 నాటికి గరిష్ఠ వయస్సు 25 ఏళ్లు. OBC (NCL) అభ్యర్థులకు మూడేళ్లు, SC/ST అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ఎంపికైన వారికి నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 పే స్కేల్ వర్తిస్తుంది. దీనికి అదనంగా ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు లభిస్తాయి. వార్షిక CTC సుమారు రూ.13 లక్షలుగా ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్షలో 125 ప్రశ్నలు, 120 నిమిషాల సమయం ఉంటాయి. మొత్తం ఎంపికలో CBTకి 85 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కుల వెయిటేజీ ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 28న ప్రారంభమైంది. నవంబర్ 18వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్షను డిసెంబర్ 22న నిర్వహించనున్నట్లు తాత్కాలికంగా ప్రకటించారు. జనరల్, EWS, OBC (NCL) అభ్యర్థులు రూ.1,180 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, PwBD, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంది. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం BEL అధికారిక వెబ్‌సైట్ www.bel-india.inను సందర్శించాలి.