భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఏపీ తుఫాన్ బాధితులకు రూ.3 వేల వరకు నగదు సాయం..

ఏపీ తుఫాన్ బాధితులకు రూ.3 వేల వరకు నగదు సాయం..

భార‌త్ స‌మాచార్, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. తుఫాన్‌ ప్రభావంతో పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొంది, తిరిగి ఇళ్లకు వెళ్లే బాధితులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో వ్యక్తికి రూ.1,000 చొప్పున, ఒక కుటుంబానికి గరిష్ఠంగా రూ.3,000 నగదు సాయం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. ఈ మొత్తాన్ని ఇప్పటికే మంజూరు చేసిన సహాయక నిధుల నుంచి ఖర్చు చేయాలని స్పష్టం చేసింది.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం అందించనున్నారు. మత్స్యకారులు, చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం ఇవ్వనున్నారు. వీటితో పాటు కిలో కందిపప్పు, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో పంచదార, ఒక లీటర్ పామాయిల్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పంపిణీకి 20 జిల్లాల కలెక్టర్లకు అనుమతి ఇచ్చారు.

ఇదిలా ఉండగా, తక్షణ సహాయక చర్యల కోసం పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఈ రెండు జిల్లాల కలెక్టర్లు చెరో రూ.4 కోట్లను తక్షణ అవసరాల కోసం వినియోగించుకునేందుకు అనుమతించింది. ఇప్పటికే తుఫాన్‌ సహాయక చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్లు మంజూరు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.

తుఫాన్‌ కారణంగా పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్‌ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. పంట నష్టానికి సంబంధించిన పరిహారం మాత్రం క్షేత్రస్థాయి పరిశీలన, నష్టం అంచనాల ఆధారంగా నిర్ణయించనున్నారు. బాధితులకు సాయం వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. అర్హులైన వారు తమ ప్రాంతంలోని అధికారులను సంప్రదించి సహాయం, నిత్యావసరాల పంపిణీ వివరాలు తెలుసుకోవచ్చు.