భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అంగన్వాడీ కేంద్రాలతో పాటు వాటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాజ్య తండా సర్పంచ్ ధారావత్ విజయ ఆనంద్ సూచించారు. నెల్లికుదురు మండలంలోని రాజ్య తండాలో శుక్రవారం సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన మంత్లీ సెక్టార్ మీటింగ్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ICDS అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ విజయ ఆనంద్, ICDS ACDPO విజయలక్ష్మి, సూపర్వైజర్ ఆర్. నీరజ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని సూచించారు. ముఖ్యంగా వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అందించే పోషకాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
గ్రామ బాలల పర్యవేక్షణ కమిటీ ఎంపిక
ఇదే సమావేశంలో గ్రామ బాలల పర్యవేక్షణ కమిటీ (VCPA)ని ఎంపిక చేశారు. సర్పంచ్ ధారావత్ విజయ ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ బాధ్యతలు, ప్రాధాన్యతపై ACDPO విజయలక్ష్మి వివరించారు. గ్రామంలో బాల్యవివాహాల నిర్మూలన, పాఠశాలల నుంచి మధ్యలోనే చదువు మానేసే పిల్లలను (డ్రాపౌట్స్) గుర్తించడం వంటి అంశాలపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత సభ్యులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సెక్టార్ పరిధిలోని వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు వి. జ్యోతి, ఎన్. శాంత, జె. భారతి, మంజుల, రాజ్యలక్ష్మితో పాటు గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.