భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా అప్రమత్తం చేయడమే లక్ష్యంగా మెదక్ పట్టణంలో శుక్రవారం పోలీసులు ఫ్లాష్ వాక్ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, IPS జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి రామాలయం మీదుగా రాందాస్ చౌరస్తా వరకు ఫ్లాష్ వాక్ కొనసాగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, పెట్టుబడుల పేరుతో జరిగే మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో చేసే బెదిరింపుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని ఎస్పీ హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు, సందేశాలు వచ్చినప్పుడు వాటిపై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. సైబర్ నేరగాళ్లు చెప్పే మాటలు నమ్మి డబ్బులు పంపడం లేదా వ్యక్తిగత వివరాలు పంచుకోవడం చేయవద్దని సూచించారు.
ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే స్పందించి, ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు. సైబర్ నేరాల నివారణకు పోలీసుల సూచనలు పాటించడంతో పాటు, కుటుంబ సభ్యులు, పరిచయస్తులకు కూడా ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సైబర్ భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే మోసాలను అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, IPS, DSPలు సుభాష్ చంద్రబోస్, రంగనాథ్, CIలు మహేష్, RIలు శైలేందర్, రామకృష్ణ, పలువురు SIలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.