భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

పట్టపగలే చోరీకి యత్నం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ దొంగ

కౌడిపల్లిలో దొంగ హల్‌చల్.. ఇంట్లో చోరీకి యత్నిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు!

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని పట్టపగలే చోరీకి ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని మల్లికార్జున కాలనీలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. మల్లికార్జున కాలనీకి చెందిన బుర్జీగాడి బుమయ్య కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన ఓ వ్యక్తి ఇదే అదునుగా భావించి చోరీకి ప్రయత్నించాడు. ముందుగా ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన అతడు, అనంతరం బీరువా తాళాన్ని కూడా ధ్వంసం చేశాడు. అందులో ఉన్న వస్తువులు, నగదు, ఆభరణాలను దొంగిలించేందుకు ప్రయత్నించాడు.

కౌడిపల్లిలో దొంగ హల్‌చల్.. ఇంట్లో చోరీకి యత్నిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు!

అదే సమయంలో బుమయ్య కుమారుడు గోపాల్ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో నుంచి అనుమానాస్పద శబ్దాలు రావడంతో లోపలికి వెళ్లి చూడగా, బీరువా తాళం పగలగొడుతున్న వ్యక్తి కనిపించాడు. వెంటనే అప్రమత్తమైన గోపాల్ చుట్టుపక్కల వారిని పిలిచాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు కలిసి నిందితుడిని పట్టుకున్నారు.

అనంతరం ఆగ్రహానికి గురైన స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడిన వ్యక్తి గతంలో ఇతర ప్రాంతాల్లోనూ చోరీలకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని వద్ద కొన్ని ఆభరణాలు ఉన్నట్లు కూడా వారు చెబుతున్నారు. అయితే ఈ వివరాలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

పోలీసులు నిందితుడిని విచారిస్తే గతంలో జరిగిన ఇతర చోరీల వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనతో కౌడిపల్లి మండల కేంద్రంలో ఇళ్ల దొంగతనాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.