భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలోని మనోహరాబాద్ మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రకటించడంపై తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ సమితి జిల్లా అధ్యక్షుడు అక్కమొల్ల మైసయ్య యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మైసయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో పంట నష్టాలను ఎదుర్కొంటున్న రైతులకు ఎంతో భరోసా లభించేదని అన్నారు. ఇప్పటికైనా పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు అండగా నిలవాలని ప్రభుత్వాలను కోరారు.
నవంబర్ మొదటి వారంలో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో రైతులతో గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై అందించాలని విజ్ఞప్తి చేశారు.
రైతు సంఘం నాయకులు అందించిన వినతిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. నవంబర్ నెలలో అన్ని గ్రామ పంచాయతీల్లో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రెండో విడతలోనైనా మెదక్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో సమితి జిల్లా ఉపాధ్యక్షుడు అంతంగారి వెంకటేశం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మిర్యాల చంద్రశేఖర్, కార్యదర్శి చండం నరేందర్, పెద్దకొల్ల మల్లేష్, ఎల్లం యాదవ్, పరశురాములు, నారాయణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.