భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

యువతకు సర్దార్ పటేల్ ఆదర్శం కావాలి: చల్లా లక్ష్మణ్

తపాసా ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) చిన్న శంకరంపేట శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్న శంకరంపేట మండలంలోని ఎంపీ యూపీఎస్ మాందాపూర్ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నడియాడ్‌లో జూవేర్‌భాయ్ పటేల్, లడ్బా దంపతులకు జన్మించారని తెలిపారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ నాయకుడిగా కీలక పాత్ర పోషించడంతో పాటు, స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో విశేష కృషి చేశారని పేర్కొన్నారు.

ముఖ్యంగా హైదరాబాద్, జునాగఢ్ వంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన కృషి కారణంగానే భారత ఉక్కు మనిషిగా గుర్తింపు పొందారని వివరించారు. రాజ్యాంగ రచనా సమయంలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్‌గా కూడా వ్యవహరించారని గుర్తుచేశారు.

తపాసా ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

2014 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా నిర్వహిస్తోందని చల్లా లక్ష్మణ్ తెలిపారు. దేశానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ మరణానంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించిందని చెప్పారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భావితరాలకు ఆయన సేవలు, జీవిత చరిత్ర గురించి మరింత అవగాహన కల్పించేందుకు పాఠ్యాంశాల్లో ఆయన జీవిత చరిత్రను చేర్చాలని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్‌తో పాటు ఉపాధ్యాయులు శోభారాణి, శ్రీనివాస్, గీత, తపస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, రమాదేవి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.