భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇప్పటి నుంచే నీటి సంరక్షణపై దృష్టి సారించాలని రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారి సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం రామాయంపేట మండల పరిధిలోని రాయిలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సోక్‌పిట్‌ను తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ కోసం గ్రామంలో చేపడుతున్న చర్యలను పరిశీలించి, భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి వృథాగా బయటకు వెళ్లే నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీనివల్ల వర్షపు నీరు భూమిలోకి చేరి భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని వివరించారు.
నీటి సంరక్షణ అనేది ఒక్కరి బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని రజనీకుమారి కోరారు. నీటిని అవసరానికి తగినంత మాత్రమే వినియోగిస్తూ, వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టు సుశీల, గట్టు ప్రశాంత్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.