భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాలని గ్రామ ప్రత్యేక అధికారి, తహసీల్దార్ రజనీకుమారి సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో శనివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, స్థానిక పరిస్థితులపై వివరాలు సేకరించారు. గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో నేరుగా మాట్లాడారు.
ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడంలో జాప్యం చేయకుండా వెంటనే పనులు చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం, ఇతర సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లాలని అవగాహన కల్పించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి, సొంతింటి కలను సాకారం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానెగల రామకృష్ణయ్య, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.