భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

కక్షిదారులకు సత్వరమే న్యాయం అందించాలి: హైకోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్

కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి    తెలంగాణ రాష్ట్ర గౌరవ  హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కక్షిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే న్యాయం అందించేందుకు న్యాయవాదులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ హైకోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్ సూచించారు. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు ధర్మాన్ని పాటిస్తూ, అన్యాయాన్ని సహించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపారు.

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోర్టు ప్రాంగణానికి చేరుకున్న హైకోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్‌కు అధికారులు, న్యాయవాదులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో మొక్కను నాటి నీరు పోసి పర్యావరణ పరిరక్షణకు సందేశమిచ్చారు. ఆ తర్వాత సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి    తెలంగాణ రాష్ట్ర గౌరవ  హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్

ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయస్థానాలను ఆశ్రయించే కక్షిదారులకు సకాలంలో న్యాయం అందడం అత్యంత ముఖ్యమన్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ అన్యాయానికి తావులేకుండా చూడాలని సూచించారు. బార్ అసోసియేషన్, బెంచ్ మధ్య అన్నదమ్ముల్లాంటి అనుబంధం కొనసాగాలని ఆకాంక్షించారు. న్యాయవాదులు డ్రెస్ కోడ్‌ను తప్పనిసరిగా పాటిస్తూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.

జీవితంలో ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండే గుణాన్ని అలవర్చుకోవాలని, అమ్మను మించిన గురువు ఎవరూ లేరని పేర్కొన్నారు. కక్షిదారుల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాలని, ప్రతి విషయంలో నిష్పక్షపాతంగా న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు.

ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, మెదక్ జిల్లా న్యాయమూర్తి నీలిమ మాట్లాడుతూ.. నర్సాపూర్ పరిసర ప్రాంత ప్రజలకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు అందుబాటులోకి రావడం వల్ల న్యాయసేవలు మరింత చేరువవుతాయని తెలిపారు. స్థానిక ప్రజలు, కక్షిదారులు న్యాయం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని, కేసుల పరిష్కారానికి సౌలభ్యం కలుగుతుందని చెప్పారు.

కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి    తెలంగాణ రాష్ట్ర గౌరవ  హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్

జిల్లాలోని కోర్టు ప్రాంగణాల్లో కక్షిదారులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా RO ప్లాంట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కోరారు. అలాగే మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా కక్షిదారులకు తక్కువ ధరకు భోజన సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమం అనంతరం తెలంగాణ హైకోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్‌ను జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు మెమెంటో అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శుభవల్లి, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రూబీనా ఫాతిమా, మెదక్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి సాయి ప్రభాకర్, అల్లాదుర్గం జూనియర్ సివిల్ జడ్జి సుచరిత తదితరులు పాల్గొన్నారు.