భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కృషిచేయాలి

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావే

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుతో పాటు కుటుంబ వ్యవస్థ, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశం అదనపు కలెక్టర్ నగేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల నియంత్రణకు జిల్లాలో చేపట్టాల్సిన చర్యలు, వివిధ శాఖల బాధ్యతలు, అవగాహన కార్యక్రమాల అమలుపై చర్చించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత జీవితాలు ప్రభావితమవడమే కాకుండా విద్యార్థుల విద్యాభ్యాసం దెబ్బతింటుందని తెలిపారు. కుటుంబాల్లో సమస్యలు పెరగడంతో పాటు సామాజిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కోవడానికి అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

పిల్లలు, కౌమారదశలో ఉన్న యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా ముందస్తు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి అవసరమైన వైద్య సేవలు, కౌన్సెలింగ్, పునరావాస సహాయం అందించేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ప్రతి ప్రభుత్వ శాఖ తమ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యాలను సాధించే దిశగా సమర్థవంతంగా పనిచేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ నవీన్, DCRB DSP వెంకటేశ్వర రావు, DMHO జ్ఞానేశ్వర్, DIEO మాధవి, శ్రీనివాస్ రావు AD, DEO, CDPOలు, హుస్సేన్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, ARES స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీత, రాకేష్, IRCA VISION NGO ప్రతినిధి ఆభరణ తదితరులు పాల్గొన్నారు.