భారత్ సమాచార్, మెదక్ జిల్లా: యువత మత్తు పానీయాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడలు, విద్య, ఇతర సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ సింగ్ సూచించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని, రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
నర్సాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ జిల్లా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్లో యంగ్ స్టార్ జట్టు విజేతగా నిలిచింది. శనివారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్లో సహారా ఇండియన్స్, యంగ్ స్టార్ జట్లు హోరాహోరీగా తలపడగా యంగ్ స్టార్ జట్టు విజయం సాధించి టోర్నమెంట్ టైటిల్ను కైవసం చేసుకుంది.
ఫైనల్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ సింగ్, DSP నరేందర్ గౌడ్, నర్సాపూర్ CI రంగకృష్ణ, SI రంజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేత యంగ్ స్టార్ జట్టుతో పాటు రన్నరప్ సహారా ఇండియన్స్ జట్టుకు బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ విక్రాంత్ సింగ్ మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తమ శక్తిసామర్థ్యాలను సరైన మార్గంలో వినియోగించుకోవాలని తెలిపారు. మత్తు పానీయాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని చెప్పారు. యువత ఉన్నత ఆశయాలతో ముందుకు సాగి జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఇరు జట్ల క్రీడాకారులు, నర్సాపూర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.