భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు ప్రాయోగిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని JNTUH కళాశాల ప్రిన్సిపాల్ డా. విశ్వనాథ రాజు, వైస్ ప్రిన్సిపాల్ డా. రాఘవేందర్ రావు, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డా. శైలజ సూచించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటే విద్యార్థులకు భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం సుల్తాన్పూర్ గ్రామంలోని JNTUHలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ARK Infosolutions సంస్థ సహకారంతో అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఇంజినీరింగ్ రంగంలో కీలకంగా మారుతున్న ఆధునిక సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఈ వర్క్‌షాప్‌లో FEA (Finite Element Analysis), CFD (Computational Fluid Dynamics), ఏరోడైనమిక్స్, స్ట్రక్చరల్ డైనమిక్స్ తదితర ఆధునిక సాంకేతిక అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ అంశాలు పరిశ్రమల్లో ఎలా ఉపయోగపడతాయి, వాటి ద్వారా వివిధ ఇంజినీరింగ్ సమస్యలను ఎలా విశ్లేషించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు.
ARK Infosolutions సంస్థకు చెందిన ఇంజినీర్ జిష్ణు రఘునాథ్ విద్యార్థులకు శిక్షణ అందించారు. ఆధునిక ఇంజినీరింగ్ టెక్నాలజీలపై అవగాహన పెంపొందించడంతో పాటు వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. విశ్వనాథ రాజు, వైస్ ప్రిన్సిపాల్ డా. రాఘవేందర్ రావు, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డా. శైలజ మాట్లాడుతూ.. కేవలం పుస్తకాల్లోని పరిజ్ఞానానికే పరిమితం కాకుండా పరిశ్రమల్లో ఉపయోగించే ఆధునిక టెక్నాలజీలపై విద్యార్థులు పట్టు సాధించాలని సూచించారు. ఇలాంటి వర్క్‌షాప్‌లు విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగ, పరిశ్రమ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.