భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతదేశంలోని అనేక సంస్థానాలను ఏకం చేసి దేశ సమైక్యతకు బలమైన పునాది వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మెదక్ జిల్లా BJP అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, పటేల్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నర్సాపూర్ పట్టణంలోని అసెంబ్లీ పార్టీ కార్యాలయంలో పట్టణ కన్వీనర్ ప్రేమ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BJP మెదక్ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ హాజరయ్యారు. తొలుత సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలో ఎన్నో సంస్థానాలు ఉండగా, వాటన్నింటినీ ఏకం చేసి ఒక సమైక్య దేశంగా తీర్చిదిద్దడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలు, దేశం పట్ల అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.
దేశ ఐక్యతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని, పటేల్ చూపిన మార్గంలో నడుస్తూ దేశ అభివృద్ధి, అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని కోరారు. ఆయన ఆశయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో OBC మోర్చా రాష్ట్ర నాయకుడు రమేష్ గౌడ్, దిశా కమిటీ సభ్యులు పెద్ద రమేష్ గౌడ్, బోడ పద్మ, రామచంద్రపూర్ ఉపసర్పంచ్ వినోద్, శివ, BJP నాయకులు శ్రీనివాస్, గోడేల రాణి, BJYM నాయకులు బిక్షపతి, చిగురు రాజుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.